ఒకరి తర్వాత ఒకరు.. ఇద్దరు BRS మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా..!!
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు, వరుస విచారణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖలను పంపారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గువ్వల రాజీనామా గులాబీ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చడిచప్పుడు లేకుండా గువ్వల పార్టీకి ఎందుకు రాజీనామా చేశారని చర్చ పార్టీలో మొదలైంది. టీబీజేపీ చీఫ్ రామచందర్ రావు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో భేటీ అయిన తర్వాత గువ్వల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కూడా గులాబీ పార్టీకి రిజైన్ చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి అబ్రహం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తనకు కాకుండా విజయుడికి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో అబ్రహం అప్పట్లోనే బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నారని ప్రచారం జరిగింది. అబ్రహం బీజేపీలో జాయిన్ కాబోతున్నారని పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీమా చేశారు. అబ్రహం కూడా గువ్వల బాలరాజు బాటలోనే కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం రిపోర్టు, లోకల్ బాడీ ఎన్నికలు, ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటుతో గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్కు ఒకేసారి ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఊహించని షాక్ తగిలినట్లైంది