ప్రాజెక్టులో అక్రమాలకు కేసీఆరే బాధ్యుడు..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ అందించిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందుంచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని సంచలన విషయాలు బయటపెట్టారు.
బ్యారేజీల నిర్మాణాల గతప్రభుత్వం అనుసరించిన విధివిధానాలు, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందుంచారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నివేదికలోని వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్ బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదికలో పొందుపరచిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ మొదలుకుని నిర్మాణం, నిర్వహణ వైఫల్యాలకు, అక్రమాలకు కారకులెవరనే అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్రవు ప్రధాన బాధ్యులని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని నిపుణులు సూచించినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా వారి నివేదికను తొక్కిపెట్టారని కాళేశ్వరం కమిషన్ తేల్చింది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో సమావేశం నిర్వహించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అంటూ మండిపడ్డారు. కేబినెట్ సమావేశం అనంతరం కొంతమంది నేతలు అరెస్టులు జరిగే అవకాశముందని.. అయిన ఆందోళపడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు