లిక్కర్ కేసు ఓ కట్టుకథ.. రూ.2000 నోట్ల వీడియోతో కుట్ర బట్టబయలు: అంబటి రాంబాబు
అసలు ఉనికిలోనే లేని లిక్కర్ కేసును సృష్టించారని అంబటి ఆరోపణ
వైసీపీ నేతలను వేధించడానికే ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శ
చెవిరెడ్డి అనుచరుడిదంటూ ప్రచారంలో ఉన్న వీడియోపై కీలక వ్యాఖ్యలు
రూ.2000 నోట్ల వీడియోతో కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఫైర్
ఏసీబీ కోర్టు ఆదేశాలతో చంద్రబాబు సిట్ కుట్ర బయటపడిందన్నారు
సీజ్ చేసిన నగదును పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వెల్లడి
లిక్కర్ కుంభకోణం కేసు పూర్తిగా కల్పితమని, కేవలం వైసీపీ ఇమేజ్ ను దెబ్బతీసి, ఆ పార్టీ నాయకులను వేధించేందుకే ఈ కేసును బనాయించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడికి సంబంధించిందంటూ ప్రచారంలో ఉన్న వీడియో, అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగమేనని విమర్శించారు.
ఆ వీడియోలో కనిపిస్తున్న రూ.2000 నోట్ల కట్టలే ప్రభుత్వ కుట్రకు నిదర్శనమని అంబటి పేర్కొన్నారు. “ఎన్నికలు జరిగింది 2024 మే నెలలో. రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ మే 2023 నాటికే చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఇప్పుడు బయటపెట్టిన వీడియోలో స్పష్టంగా రూ.2000 నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి ఎన్నికల్లో లిక్కర్ వ్యాపారంతో వచ్చిన డబ్బును చెవిరెడ్డి పంపిణీ చేశారన్న ఆరోపణ అబద్ధమని వారే ఒప్పుకున్నట్టు కాదా?” అని అంబటి ప్రశ్నించారు. ఈ వీడియోను లిక్కర్ కేసుకు ముడిపెట్టడం ద్వారా, చంద్రబాబు వేసిన సిట్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే కేవలం గాలి మాటలు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసులో భాగంగా సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదు విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ కుట్ర బయటపడిందని తెలిపారు. ఆ నోట్ల సీరియల్ నంబర్లను నమోదు చేసి, ఫోటోలు తీయమని కోర్టు ఆదేశించినప్పటికీ, సిట్ అధికారులు ఆ ఆదేశాలను పక్కనపెట్టి, ఆధారాలను నాశనం చేసేందుకు ఆ నగదును హడావుడిగా బ్యాంకులో జమ చేశారని ఆరోపించారు. దీనిపై నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించగా, స్వాధీనం చేసుకున్న నోట్లను విడిగా ఉంచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ నోట్లను పరిశీలిస్తే, అవి ఎప్పుడు, ఎక్కడి నుంచి విడుదలయ్యాయో తేలిపోతుందని అంబటి వివరించారు.
ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం మరొక తప్పు చేస్తోందని, అక్రమ అరెస్టులు, తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.
కాగా, 2019-24 మధ్య వైసీపీ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని, సుమారు రూ.3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని సిట్ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది