వసతి గృహాల్లో విద్యార్ధులకు ఉత్తమ వసతులు కల్పించాలి: కలెక్టర్ అభిలాష అభినవ్
ఖానాపూర్‌లో గిరిజన బాల, బాలికల వసతి గృహాలపై ఆకస్మిక తనిఖీ
ఆధునిక వసతులు, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ వసతి గృహాల లక్ష్యమని, ఇందుకోసం అధికారులు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
బుధవారం ఆయన ఖానాపూర్లోని ప్రభుత్వ గిరిజన బాల, బాలికల వసతి గృహాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.
పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ
-
పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి.
-
ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ ఉండాలి.
-
సిలబస్ నిశ్చిత సమయంలో పూర్తయ్యేలా చూసుకోవాలి.
ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి
వంటగదిని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలన్నారు. కూరగాయలు, వంటసామాగ్రిని పరిశుభ్రతతో నిల్వ చేయాలని సూచించారు.
పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై ఆదేశాలు
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాల్లో పారిశుద్ధ్యం పటిష్టంగా నిర్వహించాలి. విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే మెరుగైన చికిత్స అందించాలన్నారు. రాత్రివేళ ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
ప్రభుత్వం బాధ్యతగా అన్ని వసతులు కల్పిస్తోంది: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
వసతి గృహాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
భవిత కేంద్రం సందర్శన
తనిఖీల అనంతరం కలెక్టర్ భవిత కేంద్రాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, తహసీల్దార్ సుజాత, ఎంపిడిఓ సునీత, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.