కార్యదర్శులకు భారంగా పంచాయితీల మారుతున్న నిర్వహణ…!
నిధులు లేక ముందుకు సాగని పనులు
*ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 27*
గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తి అయి దాదాపు 18 నెలలు పూర్తి కావస్తున్న నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదు. మండల కేంద్రమైన ముధోల్ తో పాటు వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు లేక పంచాయతీ కార్యదర్శులకు నిర్వహణ భారంగా మారుతుంది. గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేపట్టడం తో పాటు ఇంటింటా తిరుగుతూ చెత్తను ట్రాక్టర్లు సేకరించి డంపింగ్ యార్డులు వేయడం వంటి పనులు చేపట్టాలి. అదేవిధంగా వర్షాకాలం కావడంతో దోమల బెడదను నివారించేందుకు విధిగా ఫాగింగ్ను నిర్వహించాలి. ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు బోరు మోటర్లను ఎప్పటికప్పుడు రిపేరు చేయాలి. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టాలి. శానిటేషన్ మెటీరియల్ కు అవసరమైన నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు సొంతంగా కొంత ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. దాదాపు 12 నెలల నుండి గ్రామపంచాయతీలకు నిర్వహణకు అవసరమయ్యే నిధులు రాక ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యదర్శులు పనులను ముందుకు సాగిస్తున్నారు. నిధుల కొరతతో పంచాయితీల్లో అభివృద్ధి నత్త నడకన సాగుతుంది. పాలకవర్గాల గడువు తీరిన తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధులు ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్ కొరకు బ్యాంకులు తీసుకున్నాయి. దాని తర్వాత మాత్రం నిధులు రాక పంచాయతీల్లో పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం స్పందించి పాలకవర్గాలకు ఎన్నికలు జరిగే వరకైనా గ్రామపంచాయతీలకు రోజువారి నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చెయ్యాలని కోరుతున్నారు.