Yashwant Varma: జస్టిస్ వర్మను తొలగించాలని ఎంపీలు సంతకాలు.. స్పీకర్‌కు సమర్పణ..!!
నోట్ల కట్ల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అడ్డంగా బుక్ అయ్యారు. ఇంట్లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి.
అట్టపెట్టెల్లో భారీగా నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫైర్ సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పైఅధికారులకు పంపించారు. ఆ ఫొటోలను అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నాకు పంపించారు. దీంతో ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అనంతరం దర్యాప్తునకు ఆదేశించగా.. ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు వర్మకు సంబంధించినవిగా కమిటీ తేల్చింది.
అయితే ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జస్టిస్ ఇంట్లో ఆ స్థాయిలో నోట్ల కట్టలు దొరకడంతో న్యాయవ్యవస్థకు చెడ్డపేరు వచ్చినట్లుగా కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇంటికి పంపించాలని సిద్ధపడింది. ఇక జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ మేరకు 145 మంది ఎంపీలు పిటిషన్ సమర్పించారు. రాజ్యసభకు సంబంధించిన 63 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు సమర్పించారు. కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, జనసేన, ఏజీపీ, ఎల్‌జేఎస్‌పీ, ఎస్‌కేపీ, సీపీఎం మొదలైన పార్టీల ఎంపీలు మెమోరాండంపై సంతకాలు చేసి ఇచ్చారు. ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీపీ చౌదరి, సుప్రియా సులే, కేసీ వేణుగోపాల్, తదితరులు అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో అభిశంసన తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. న్యాయవ్యవస్థకు మచ్చ రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారు.
జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం
మార్చి 14న జస్టిస్ యశ్వంత వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11:43 గంటలకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగదు వీడియోలను రికార్డ్ చేసి ఢిల్లీ పోలీసులు.. సీనియర్ అధికారులకు పంచారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దాదాపు రూ.15 కోట్ల వరకు నగదు ఉంటుందని సమాచారం. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. కానీ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. నోట్ల కట్టలు వర్మవిగా కమిటీ తేల్చింది. అయితే కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు