700 సంవత్సరాల చరిత్ర గల శ్రీ రాజరాజేశ్వర దేవుని ఆలయం
భక్తిశ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు
నిర్మల్, ఫిబ్రవరి 27 మనోరంజని ప్రతినిది
శివుడు, శంకరుడు, మహాదేవుడు, సోమేశ్వర్, రాజేశ్వర్, రాజన్న, మల్లన్న, గంగాధర్… ఇలా భగవంతుని పేర్లు ప్రతి ఇంటి నుంచీ వినిపించే గ్రామం పార్డి (బి). ఇది నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఉంది. ఈ గ్రామంలో 700 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రాజరాజేశ్వరుని ఆలయం ప్రధాన ఆరాధ్య స్థలంగా భాసిల్లుతోంది. భక్తుల నమ్మకంతో ఈ ఆలయం గ్రామానికి సుదీర్ఘకాలంగా ఆనందంలో నింపుతోంది.
పార్వతమ్మతో దేవుని కళ్యాణోత్సవం
700 సంవత్సరాలుగా కొనసాగుతున్న విశేష ఆచారం ఆలయం ముందున్న ఆరు పార్వతమ్మల సమాధులు. ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజున శ్రీ రాజరాజేశ్వరుని వివాహం మానవ రూపంలోని పార్వతమ్మతో నిర్వహించేవారు. చిన్న వయసులోనే భక్తి మార్గంలో నడిచిన పార్వతమ్మ జీవితాంతం దేవునికి అంకితం చేసుకుని, ఆయన భార్యగా కొలువై ఉండేది. ఆమె మరణానంతరం ఆలయం ఎదుట అంత్యక్రియలు జరిపి సమాధి నిర్మించేవారు. గ్రామస్తుల నిర్ణయంతో ఈ ఆచారాన్ని 15 సంవత్సరాల క్రితం నిలిపివేశారు. ప్రస్తుతం పార్వతమ్మ విగ్రహాన్ని దేవుని విగ్రహంతో వివాహం జరుపుతున్నారు.
శివుని ఆజ్ఞ లేకుండా శుభకార్యాలకు అనుమతి లేదు
గ్రామంలోని శుభకార్యాలు శ్రీ రాజరాజేశ్వరుని వివాహం అనంతరం మాత్రమే ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి రోజున నిర్వహించే కళ్యాణోత్సవం అనంతరం వివాహాలు, శుభకార్యాలు చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. గతంలో దీన్ని పాటించని కుటుంబాలు అనుకోని సమస్యలను ఎదుర్కొన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మహాశివరాత్రి నుండి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఐదు రోజుల ఉత్సవాల విశేషాలు
-
మొదటి రోజు: శ్రీ రాజరాజేశ్వరునికి అభిషేకం, దీపజ్యోతి కార్యక్రమం, జెండా కార్యక్రమం.
-
రెండవ రోజు: శివాపార్వతుల గంగాస్నానం, రాత్రి పెండ్లి ఉత్సవం.
-
మూడవ రోజు: భక్తులు ప్రత్యేక పూజలు, జాగరణ.
-
నాల్గవ రోజు: నైవేద్య సమర్పణ, దొంతుల ఉత్సవం, కుస్తీ పోటీలు.
-
ఐదవ రోజు: భక్తులకు అన్నదానం, అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమం.
కుస్తీ పోటీలలో మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల నుంచి పహిల్వాన్లు పాల్గొంటారు. విజేతలకు గ్రామస్థులు బహుమతులు అందజేస్తారు. భక్తుల సేవలో ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఉత్సవాలకు దూరదూరాల నుంచి భక్తులు తరలి వస్తారు. వారికోసం ఉచిత భోజనం, విశ్రాంతి ప్రాంతాలు, నీటి వసతులు అందుబాటులో ఉంటాయి. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలు ఆలయ వైభవాన్ని చాటిచెబుతున్నాయి