కాంగ్రెస్ పార్టీకి ‘గాడిద గుడ్డు’ ఇచ్చారు..!!
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంపై తెలంగాణలోని రాజకీయ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
బీజేపీతోపాటు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనపై సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు మిగిలిందని ఎద్దేవా చేశారు.
మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘం అని హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా.. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రన మీకు ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. మీ గ్యారంటీల నిజస్వరూపం దేశ వ్యాప్తంగా బట్టబయలైందన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన కాంగ్రెస్ పార్టీకి బెడిసికొట్టిందన్నారు హరీశ్ రావు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకుని.. ప్రజలకు క్షమాపణలు చెప్పి కులగణను మళ్లీ నిర్వహించాలన్నారు. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలన్నారు.
ఆరు గ్యారంటీలు, ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని రేవంత్ రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి గాడిది గుడ్డే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయిందన్నారు. ఉచితాలతో అధికారం కౌవసం చేసుకోవచ్చని భావించే రాజకీయ పార్టీలకు ఢిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠం అని అన్నారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చారంటూ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు గాడిద గుడ్డు ఇచ్చారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గతంలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వాటికి కౌంటర్లు ఇస్తున్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు.
మరోవైపు, తెలంగాణ బీజేపీఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని.. ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైందన్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు. ఆప్ ప్రభుత్వం తప్పుడు హామీలతో, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు