👉 ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు వసంత పంచమి వేడుకలు.
👉 భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం.
👉 అన్ని శాఖల సమన్వయంతో అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకు చర్యలు.
జ్ఞాన సరస్వతి ఆలయంలో ఫిబ్రవరి 1 నుండి 3 వరకు జరగనున్న వసంత పంచమి వేడుకలకు సంబంధించి భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్ని శాఖల సమన్వయం కోరారు.
నిర్మల్ జిల్లా భాసరలో జ్ఞాన సరస్వతి ఆలయంలో ఫిబ్రవరి 1 నుండి 3వ తేదీ వరకు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, ఆలయ పరిపాలనాధికారి నవీన్ కుమార్ నేతృత్వంలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భక్తుల రద్దీ, సురక్షితత తదితర అంశాలపై చర్చించారు. రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, దేవదాయ శాఖలు భక్తులకై అన్ని రకాల సౌకర్యాలు అందించాలని ఆర్డీవో కోమల్ రెడ్డి స్పష్టం చేశారు.
అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని మరియు ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో అశోక్, ఎస్సై గణేష్, తహసిల్దార్ పవన్ చంద్ర జాకాటి, వైదిక బృంద సభ్యులు సంజు పూజారి, ప్రవీణ్ మహారాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.