ఫుడ్ ఇన్నొవేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించండి!
కార్గిల్ వైస్ ప్రెసిడెంట్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
దావోస్: ఆహార పదార్థాలు, యానిమల్ న్యూట్రిషన్, ప్రొటీన్, సాల్ట్ పారిశ్రామిక ఉత్పత్తులు, కమాడిటీస్ ట్రేడింగ్ లో పేరెన్నికగన్న కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్ స్టర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 8.5మిలియన్ హెక్టార్ల వ్యవసాయభూమి కలిగి ఉంది. రాష్ట్రంలోని 5 అగ్రో క్లైమిటిక్ జోన్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, తృణధాన్యాలు, సన్ ఫ్లవర్, మామిడి, అరటి, నారింజ, నిమ్మ, పసుపు, కాఫీ, నల్లమిరియాలు వంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్ పంటలో దేశంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారుగా, సన్ ఫ్లవర్ లో 2వ ఉత్పత్తిదారుగా ఎపి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 9 ఆపరేషన్లు ఫుడ్ పార్కులు, 14 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆక్వాకల్చర్ సాగు, గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ఎపి నెం.1గా ఉంది. 1054 కి.మీ.ల సువిశాల తీర ప్రాంతం, ఆరు ఆపరేషనల్ పోర్టులు మారిటైమ్ ట్రేడ్ కు అనువుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కార్గిల్ సంస్థ ఫీడ్, మిల్లింగ్ ప్లాంట్లను ఏర్పాటుచేయండి. వ్యవసాయ వ్యాపారానికి మద్దతు ఇచ్చేందుకు ఫుడ్ ఇన్నొవేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించండి. పొడి ప్రాంతాల్లో బంగాళా దుంపల సాగుకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి ఆర్ అండ్ డి కి సహకారం అందించండి. ఎడిబుల్ ఆయిల్ విభాగంలో స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాల భాగస్వామ్యంతో పనిచేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు