యధావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు.!
* నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం
* సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామి
* పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచన
* సంతోషం వ్యక్తం చేసిన హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు
దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల పలు హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలను (నాన్ ఎమర్జెన్సీ ) నిలిపివేశాయి.
ఈ నేపథ్యంలో హాస్పిటల్స్ యాజమాన్యాలతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం సమావేశమయ్యారు.
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేశ్, జనరల్ సెక్రటరీ హరిప్రకాశ్, డాక్టర్ సౌజన్య, హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంప్యానల్‌మెంట్ ఎంవోయూను సవరించాలని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల రేట్లను రివైజ్ చేయాలని కోరారు..ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించాలని, దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
* ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..!
‘పేద ప్రజల విద్య, వైద్యం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా విద్య, వైద్యానికి నిధులు విడుదల చేస్తున్నాం.
ఆరోగ్యశ్రీకి గతంలో ఏడాదికి సగటున 500 కోట్లు చెల్లిస్తే, మా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 1137 కోట్లు చెల్లించాం. గతంలో ఉన్న బకాయిలను కూడా క్లియర్ చేశాం. రెగ్యులర్‌గా పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నాం. మరో 6 నెలల్లో బకాయిలు లేకుండా పేమెంట్స్ క్లియర్ చేస్తాం. హాస్పిటళ్లను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మీరు నష్టపోకూడదు, అదే సమయంలో ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదు. ఇది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీరు ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలను మాకు తెలియజేయడానికి అవకాశం ఉంది. మీరు లేవనెత్తిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత మాది.
ప్యాకేజీల రేట్లను 2013లో రివైజ్ చేశాం. మళ్లీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్యాకేజీ రేట్లను రివైజ్ చేశాం. రివిజన్‌కు సంబంధించి హాస్పిటళ్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేసి, సానుకూల నిర్ణయం తీసుకుంటాం..ఇతర సమస్యలను సైతం పరిష్కరించే బాధ్యత మాది.”అని మంత్రి అన్నారు.
ఇతర సమస్యలపై చర్చించేందుకు హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈవోతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు..దీనితో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.
* ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ..!
మంత్రి తమను పిలిచి మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. గతంలో తమతో ఎవరూ ఇలా మాట్లాడలేదన్నారు. మంత్రిగారి హామీ మేరకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సేవలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ కింద నెలకు సగటున 50 కోట్ల వరకు రిలీజ్ చేయగా, ప్రస్తుతం నెలకు సుమారు 100 కోట్ల వరకూ రిలీజ్ చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు