*ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలపై, హాస్టళ్ల నిర్వాహకులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి*
*సీఎంఆర్ బాలికల హాస్టల్ ఘటనలో నిందితులపై మరియు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి*
*ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి విజ్ఞప్తి*
సెక్రటేరియట్ జోన్ (హైదరాబాద్): సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్ వాష్ రూమ్ లో వీడియోలు తీసిన ఇద్దరు యువకులతో పాటు ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాలికల వసతి గృహాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించకపోవడం, భద్రత నియమాలను పట్టించుకోకపోవడం, హాస్టల్లో పనిచేసే యువకులను అక్కడే ఉంచడం వల్ల ఈ ఘటనకు దారి తీసినట్లు అర్థమవుతుందని ఆమె అన్నారు. బాత్రూంలో ఎవరో తొంగి చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నారనే అనుమానంతో విద్యార్థినిలు సంబంధించిన వార్డెన్ లకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా, నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం క్షమించరాని నేరమని ఆమె అన్నారు. బాలికల భద్రత విషయంలో కళాశాలల యాజమాన్యాలు, హాస్టళ్ల నిర్వాహకులు నిర్లక్ష్యం వస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాలల అనుమతులను రద్దు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. బాలికల భద్రత, రక్షణ విషయంలో కళాశాలలు, హాస్టళ్ల నిర్వాహకంపై త్వరలో మా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ ఆధ్వర్యంలో ప్రత్యేక రిపోర్టును సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వీరమల్ల రామ్మూర్తి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తమ్మల్ల ఆంజనేయులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు మర్రపు నాగార్జున రావు, ఉపాధ్యక్షులు సురెడ్డి నవీన్ రెడ్డి, సింగంపల్లి లీలా భవాని, ప్రధాన కార్యదర్శి ఎస్వి సురేష్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కాలే సురేందర్, గ్రేటర్ హైదరాబాద్ సలహాదారురాలు, ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షురాలు అస్మత్ ఉన్నిసా, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.