అమ్మ బాబోయ్ కుక్కల బెడద…!
భయాందోళనకు గురవుతున్న స్థానికులు
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్లోని వివిధ వార్డుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తుండంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడద అధికమవడంతో చిన్నారులు ఆరుబయట ఆడుకోవడానికి భయపడుతున్నారు. మూగజీవాలతో పాటు మనుషు పై కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు ఇటీవలే పెరిగాయి. ప్రధాన కూడళ్ళలో కుక్కలు గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలకు ప్రధాన రహదారుల గుండా రాకపోకలు కొనసాగిస్తున్నారు. కుక్కలు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా దాడి చేయడంతో గాయాలపాలై ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలు- పాదాచారులను వెంబడించి గాయపరిచిన సంఘటనలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా కుక్కల గుంపులు దర్శనం ఇవ్వడంతో అమ్మ బాబోయ్ కుక్కలు బెడదని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి ప్రజలను కుక్కల బెడద నుండి కాపాడడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.