- తిరుపతి మహిళకు పార్ట్ టైమ్ జాబ్ పేరుతో సైబర్ మోసం.
- 13 బ్యాంక్ ఖాతాల్లోకి 50 లక్షలు పంపించిన బాధితురాలు.
- మరో 30 లక్షలు ఇవ్వాలంటూ మహిళను మోసగించడానికి ప్రయత్నం.
- ఫిర్యాదుతో 7 లక్షల సైబర్ అకౌంట్ ఫండ్ హోల్డ్.
- సైబర్ నేరాల విషయంలో ప్రజలకు పోలీసుల అవగాహన కార్యక్రమం.
తిరుపతిలో ఓ మహిళను పార్ట్ టైమ్ జాబ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. వాట్సాప్ ద్వారా లింక్ క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వమంటూ నమ్మబలికిన బాధితురాలు 13 ఖాతాల్లోకి 50 లక్షలు పంపించారు. మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా 7 లక్షల నిధులను స్తంభింపజేశారు. ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు సదరు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ మహిళ బలి అయ్యింది. సైబర్ మోసగాళ్లు వాట్సాప్ ద్వారా లింకులు పంపించి, క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వమని కోరారు. “పార్ట్ టైమ్ జాబ్” పేరుతో మాయ మాటలు చెప్పి, 13 బ్యాంక్ ఖాతాల్లోకి మొత్తం 50 లక్షలు జమ చేయించారు.
మరో 30 లక్షలు పంపమంటూ మహిళను మోసగాళ్లు ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అనుమానాస్పద గ్రూపుల్లో చేరిన మహిళకు చివరికి మోసపోయినట్టు తెలియడంతో తన తల్లిదండ్రుల సహాయంతో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి, బాధితురాలి 1930 సైబర్ ఫిర్యాదుతో 7 లక్షల సైబర్ నిధులను స్తంభింపజేశారు.
తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు మాట్లాడుతూ, “సైబర్ మోసాల బారిన పడకుండా అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు, మీ బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మోసానికి గురైతే వెంటనే పోలీసులని సంప్రదించండి,” అంటూ సూచించారు.