విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ అమలు చేయాలి!
42శాతం రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ వినతి
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి గుర్రం నరేష్, నవంబర్ 04, 2025.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో బీసీలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడంతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ మండల తహసీల్దార్ శ్రీధర్ గారికి వినతిపత్రం అందజేశారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, 42% రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయడం ద్వారా అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రభుత్వం ప్రకటించిన బీసీ సబ్ ప్లాన్ కింద బీసీ విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి కోసం 40,000 కోట్లు కేటాయించి ఖర్చు చేయాలని, హామీలను పూర్తిగా అమలు చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు గోపి, రంజిత్, సాయి, ప్రశాంత్, క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు.