నిర్మల్‌కి రానున్న 300 మంది సాధులు
మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్, డిసెంబర్ 08
ఉత్తర భారతదేశం నుంచి గోదావరి పరిక్రమ (ప్రదక్షిణ) కోసం బయలుదేరిన 300 మంది సాధు, మహాత్ములు, సత్పురుషులు, సిద్ధపురుషులు ఈనెల 9న నిర్మల్ చేరుకోనున్నారని స్వాగత కమిటీ సభ్యుడు అరుణ్ శర్మ సోమవారం తెలిపారు. నాసిక్‌లో గోదావరి నదీ తీరంలో ప్రారంభమైన ఈ పరిక్రమ యాత్ర బాసర మీదుగా కాలేశ్వరం చేరుకుని, అక్కడి నుంచి భద్రాచలం, రాజమండ్రి, అనంతరం అంతర్వేదిలో తల్లి సముద్రంలో విలీనమవుతుందని ఆయన వెల్లడించారు. మొత్తం 15 రోజులపాటు ఈ పరిక్రమ సాగనున్నట్లు తెలియజేశారు .యాత్ర బృందం మంగళవారం నిర్మల్ చేరుకోనున్న నేపథ్యంలో, రాజా శ్యామల పీఠం, మహాదేవ శక్తి సంసాన్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ఈద్గామ్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేపట్టినట్లు కమిటీ వెల్లడించింది. అనంతరం భవ్యమైన శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులు, వ్యాపార వర్గాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాధుమహాత్ముల ఆశీర్వచనం పొందాలని కమిటీ కోరింది.