తగిలేపల్లి గ్రామస్తుల ఆగ్రహం –
‘కీ స్టోన్’ కంపెనీ రోడ్ కాంట్రాక్టర్ తీరుపై తీవ్ర విమర్శలు
అనుమతి కంటే ఎక్కువ భూమిలో మొరం తవ్వకాలు, ప్రభుత్వ భూములపై కబ్జా యత్నాల ఆరోపణలు
తగిలేపల్లి, వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా:
తగిలేపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా పెద్ద ఎత్తున మొరం తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, గ్రామస్తులు “కీ స్టోన్” కంపెనీ రోడ్డు కాంట్రాక్టర్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి కేవలం ఒక ఎకరానికి మాత్రమే ఉన్నప్పటికీ, పర్యావరణ నియమాలను ఉల్లంఘించి ఐదు ఎకరాల భూమిలో తవ్వకాలు జరిపారని వారు ఆరోపించారు.
గ్రామస్తుల నిరసన, పనులకు అడ్డుపడి నిరసన
ఉదయం సమయంలో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన గ్రామస్తులు, JCBలు మరియు టిప్పర్లను నిలిపివేశారు. తాము గత కొన్ని రోజులుగా ఇది గమనిస్తున్నామని, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనలేకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని తెలిపారు.
ప్రజా ప్రతినిధి ముసుగులో అక్రమాలు?
ఈ తవ్వకాలకు గ్రామంలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఆయననే దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్‌గా అభివర్ణిస్తూ, తాను ఎవరూ అడ్డు పడలేరని బలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తవ్వకాలు పూర్తయిన తర్వాత భూమిని చదును చేసి కబ్జా చేయాలన్నదే ఆంతర్యం అని ఆరోపణలు చేశారు.
వాల్టా చట్టం ఉల్లంఘన, ప్రకృతి ధ్వంసం
వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొండలు, గుట్టలు మాయం చేస్తుండగా, విలువైన చెట్లు, క్షేత్ర వనరులు నాశనమవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పర్యావరణానికి ముప్పుగా మారుతోందని హెచ్చరిస్తున్నారు.
అధికారుల జోక్యం కావాలి
“ఇవేలా సాగితే భవిష్యత్తులో గ్రామస్తులకు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వ భూములను కాపాడడంలో అధికారులు వెంటనే స్పందించాలి” అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలను ఆపి, సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.