మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వ్యాపారస్తులు సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే బిఎల్ఆర్, స్థానిక రాజీవ్ చౌక్ రౌండ్ నుంచి హనుమాన్ పేట ఫ్లవర్ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారులను నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, రోడ్డుకు ఇరువైపులా 84 అడుగుల రోడ్డును ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు.
రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లపై వాహనాలు నిలపాలని, ఫుట్ పాత్ లకు అవతల వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. నిర్దేశించిన స్థలాలలోనే బండ్లు, ఇతర సామాగ్రిని పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలని, తద్వారా ట్రాఫిక్ కు ఆటంకం కలిగించవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఈ వెంకన్న, డీఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐ సోమ నరసయ్య, ఎస్సై రాంబాబు, మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించడం ద్వారా పట్టణంలో వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు.












