ముహూర్తం ఖరారు..?,,,సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని ఉత్సాహాన్ని, రాజకీయంగా కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ గెలుపును పునాదిగా చేసుకుని..
ప్రభుత్వం ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ ఎన్నికలను ఒక సువర్ణావకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ (వెనుకబడిన తరగతుల) రిజర్వేషన్ల అంశం ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాలుగా మారింది. గతంలో ప్రవేశపెట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన (లీగల్) సమస్యలు, అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో.. అధికారులు మరో నివేదికను సిద్ధం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదు. ఈ న్యాయపరమైన పరిమితిని దృష్టిలో ఉంచుకుని.. మొత్తం 50 శాతం పరిమితిలోనే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించేలా అధికారులు మార్గాలను అన్వేషించారు. దీనికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
బీసీ రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి లోబడి కేటాయించడం వల్ల, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి మంత్రులకు కీలక సూచనలు ఇచ్చినట్లు సమాచారం. బీసీల నాయకులతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడి.. న్యాయపరమైన చిక్కుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇది కేవలం తాత్కాలికమేనని వివరించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. బీసీ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని, భవిష్యత్తులో వారికి మరింత న్యాయం చేసే ప్రణాళికలను వివరించడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది.
ప్రస్తుత పరిణామాలు గమనిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా లేదా తదుపరి నెల మొదటి వారంలోగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఎన్నికలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త స్థానిక నాయకత్వాన్ని అందించి, పార్టీ బేస్ ను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే.. ఎన్నికల తర్వాత కూడా తమ ఆరు గ్యారంటీల అమలుకు స్థానిక సంస్థల ద్వారా మరింత వేగం పుంజుకోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థానిక ఎన్నికలు తెలంగాణ రాజకీయాలపై, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లపై కాంగ్రెస్ పట్టును స్పష్టంగా తెలియజేస్తాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత కాంగ్రెస్ కు ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది.. ఈ ఊపులోనే స్థానిక సంస్థలకు వెళ్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం భావిస్తోంది.