వైభవంగా అమ్మవారి పునః ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం
భజనలు, మంగళహారతుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైన అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి మహోత్సవం
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి సారంగాపూర్ నవంబర్ 03
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అడెల్లి గ్రామంలో శ్రీ మహా పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్టాపన వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే భజన బృందాల గానాలు, మంగళ వాయిద్యాల నాదం మధ్య అమ్మవారి విగ్రహాన్ని గ్రామం నుండి ఆలయం వరకు ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో, భక్తులు నినాదాలతో ఊరంతా ఆధ్యాత్మిక మైకాన్ని నింపేశారు. తరువాత వేదపండితుల ఆధ్వర్యంలో మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతల పూజలు, మహాగణపతి హోమం, జఠాధివాసం వంటి పవిత్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్యదర్శభంతో ఆనందంలో తేలిపోయారు. ఆలయ పరిసరాలు భక్తి గీతాలతో, దీపాల కాంతులతో, పూల సుగంధాలతో ఆధ్యాత్మిక క్షేత్రంగా మారాయి.