టీఎన్జీవో భవనంలో ఘనంగా 19వ కాన్సిరాం వర్ధంతి వేడుకలు
ప్రజల హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలి: మైస ఉపేందర్ మాదిగ
నిర్మల్: మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 19వ కాన్సిరాం వర్ధంతి వేడుకలు గురువారం టీఎన్జీవో భవనంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ కుటుంబాలకు పది లక్షల రూపాయల దళిత బంధు అందించిందని గుర్తుచేశారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్లలో ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ ప్రకారం, ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాలని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
“ప్రజాపాలన పేరుతో నేడు దోపిడీ పాలన కొనసాగుతోంది. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లో చైతన్యం తీసుకురాగలదు,” అని ఉపేందర్ మాదిగ హెచ్చరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి పలు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు కత్తి విష్ణు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకే ప్రభాకర్, ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంధం గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శివ, పట్టణ అధ్యక్షుడు బిక్కు రాజేశ్వర్, రామంచు రాము, కుందూరు రాజేందర్, చిట్యాల వినోద్, బర్ల సాయినాథ్, కొల్లూరు కృష్ణ, సూర్యకాంత్, న్యాయవాది పసియుద్దీన్, లక్ష్మీపూర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.