నిర్మల్ జిల్లా పోలీస్ శాఖను సాంకేతికంగా మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు నూతన సాంకేతిక పరికరాలను పంపిణీ చేశారు. ఈ చర్యల ద్వారా కేసుల దర్యాప్తు, కోర్టు ప్రక్రియలలో వేగాన్ని పెంచి, ప్రజలకు సత్వర న్యాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పోలీసు వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. "కేసు రాసేందుకు గంటలు, ఫైలు వెతకడానికి రోజులు అయ్యే రోజులు పోయాయి. ఇప్పుడు బార్కోడ్ స్కాన్ చేయగానే కేసు వివరాలు తెరపైకి వస్తాయి. ప్రజల సమయం విలువైనది, న్యాయం ఇంకా విలువైనది" అని ఆమె పేర్కొన్నారు.
పంపిణీ చేసిన పరికరాలలో బార్కోడ్ స్కానర్లు, లేబుల్ ప్రింటర్లు, సింగిల్ డిజిట్ స్కానర్లు, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిస్టమ్స్, హైస్పీడ్ ప్రింటర్లు ఉన్నాయి. ఈ పరికరాల ద్వారా సాక్ష్యాలు, ఫైళ్లను బార్కోడ్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. వేలిముద్రల ద్వారా నిందితుల గత చరిత్రను క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ బ్యూరో సిస్టమ్స్ వేలిముద్రలను డిజిటల్‌గా నిల్వ చేసి, సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను బలోపేతం చేస్తాయి.
హైస్పీడ్ ప్రింటర్లు ఎఫ్ఐఆర్ కాపీలు, నోటీసులు, కోర్టు సమన్లను వేగంగా అందించడానికి ఉపయోగపడతాయి. ఈ సాంకేతికతతో ఫిర్యాదు అందిన కొద్దిసేపట్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కాపీని అందించడం సాధ్యమవుతుంది. కోర్టుకు అవసరమైన కేసు ఫైళ్లు, సాక్ష్యాల వివరాలను కోర్టు కోఆర్డినేటర్, ప్రాసిక్యూషన్ అధికారులకు సులభంగా చేరవేయవచ్చు.
ఈ నూతన సాంకేతికత అమలుతో పోలీస్ శాఖలో పారదర్శకత 100% పెరుగుతుందని, ప్రతి సాక్ష్యానికి బార్కోడ్, ప్రతి కదలికకు లాగ్ ఉండటం వల్ల ఫైళ్ల గోప్యత, డేటా మార్పు వంటివి జరగవని ఎస్పీ విశ్వాసం వ్యక్తం చేశారు. పెరుగుతున్న కేసుల సంఖ్య దృష్ట్యా, టెక్ సమస్యల వల్ల జాప్యం జరగకుండా ఈ పరికరాలు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆమె తెలిపారు.












