Nirmal/Basar (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, చాలా మందికి ఓటు హక్కు లేదని తేలడం, వివరాలు అందకపోవడంతో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బీఎల్ఓల నిర్లక్ష్యం, ఫారాలు అందకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ఆలస్యమవుతోందని బాధితులు వాపోతున్నారు.
రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. 2002 ఓటరు జాబితాతోనే కొత్త చిక్కులు తలెత్తాయని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి ఓటరు జాబితా ప్రకారం మ్యాపింగ్ చేయాల్సి ఉండగా, చాలా మందికి ఓటు హక్కు లేదని తేలడం, వివరాలు చూపించకపోవడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు.
నాటి మ్యాపింగ్ ప్రకారం తమ తల్లిదండ్రులకు ఓటు హక్కు ఎక్కడ ఉంది? పోలింగ్ బూత్ ఏది? ఏ వార్డు? వంటి వివరాలు తెలియక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓల) నిర్లక్ష్యం వల్ల ఎస్ఐఆర్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. అనేక మంది ఓటర్లకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. ఎన్నికల సంఘం మాత్రం లెక్కల్లో 99 శాతం ఫారాలు పంపిణీ చేసినట్టు చెబుతోంది.
ఓటరుగా తమ పేరు జాబితాలో ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు తమ బీఎల్ఓ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆయన ఉండే ఇల్లు వంటి వివరాలు తెలుసుకుని మరీ ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుంటున్నారు. పారదర్శకంగా ఫారాల పంపిణీ జరగకపోవడంతో ఓటర్లు ఎన్నికల సంఘం, ఉన్నతాధికారుల పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
చాలా మందికి 2002లో తమ ఓటు ఎక్కడుందో తెలియడం లేదు. ఏ పోలింగ్ బూత్‌లో ఉందో కనుక్కోవడం గగనంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా తెలియని వారి కష్టాలు అంతా ఇంతా కాదు. అప్పుడు వారున్న నియోజకవర్గం, పోలింగ్ బూత్ ఎక్కడో తెలియక, గుర్తు చేసుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. కిరాయి ఇళ్లల్లో ఉండేవారు తరచూ మారుతుంటారు. అలాంటి వారికి నాటి ఓటరు జాబితా మ్యాపింగ్ ఇప్పుడు ఎలా తెలుస్తుంది? నాడు ఓటు వేసామో లేదో కూడా కొందరికి గుర్తులేదని చెబుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఒకే చోట ఉండకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిసింది. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు 2002 ఓటరు జాబితాను మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాథమిక నిబంధన. అయితే, ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న ఓటర్లే తమ పేర్లు చూపించడం లేదని, ఎన్యూమరేషన్ ఫారాలు రాలేదని, వచ్చినా ఎలా ఫిల్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నెల 24తో ఎన్యూమరేషన్ గడువు ముగియనుంది. కానీ ఇంకా ఫారాలే అందకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు అంతా సాఫీగా నడుస్తోందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఓటర్లు బీఎల్ఓలపై మండిపడుతుండగా, మరోవైపు బీఎల్ఓలు ఓటర్లను హెచ్చరిస్తున్నట్టుగా తెలిసింది. ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ఇస్తేనే ఓటు హక్కు ఉంటుందని, లేదంటే భారత పౌరులు కాకుండా పోతారని హెచ్చరిస్తున్నట్టు తెలిసింది.
కొందరు ఓటర్లు 2002 ఓటరు జాబితాలో తమ పేర్లు దొరక్క ఇబ్బందులు పడుతూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వడం లేదని సమాచారం. ఇదే విషయాన్ని బీఎల్ఓల దృష్టికి తీసుకెళ్తే, ఫారం ఇవ్వని వారికి ఓటు హక్కు రద్దు అవుతుందని, భారతీయులుగా ఇకపై గుర్తించబోరని హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది.












