ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీనిలో భాగంగా, ఉపాధి హామీ కూలీలకు ముఖ హాజరు (ఫేషియల్ అథెంటికేషన్) తప్పనిసరి చేసింది. ఈ నిబంధన మార్చి 4వ తేదీ (సోమవారం) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అమలులోకి రానుంది.
గతంలో జాబ్ కార్డులో ఒకరి పేరు ఉంటే, మరొకరు పనులకు హాజరవడం, మస్టర్లలో దొంగ సంతకాలు వంటి అక్రమాలు చోటుచేసుకునేవి. వీటిని అరికట్టేందుకు కేంద్రం ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో మెజారిటీ కూలీలకు ఈ-కేవైసీ పూర్తయింది.
కొత్త విధానం ప్రకారం, ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు ఒక ఐడీని క్రియేట్ చేస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు పని ప్రారంభంలో కూలీల ఫోటో తీస్తారు. పని పూర్తయిన నాలుగు గంటల అనంతరం మరోసారి ఫోటోలు తీస్తారు. ఈ రెండు ఫోటోలు సరిపోలితేనే పనులు పూర్తి చేసినట్లుగా పరిగణించి, వేతనాలు జమ అవుతాయి.
అయితే, మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సిగ్నల్ సమస్యల కారణంగా ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలులో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లకు, పని ప్రదేశంలో ఫోటోలు తీసి, సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వెళ్లి యాప్లో అప్లోడ్ చేయాలని సూచిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా పథకం పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, కూలీలకు వేతనాలు సకాలంలో అందుతాయని అధికారులు తెలిపారు.


