నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ గోదాంపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా విధానం, భద్రతా ప్రమాణాల అమలును అధికారులు సమగ్రంగా పరిశీలించారు.
గోదాంలో నెలకొల్పిన భద్రతా ఏర్పాట్లు, అగ్నిమాపక పరికరాల లభ్యత, వాటి వినియోగం, సిలిండర్ల నిల్వలో అనుసరిస్తున్న పద్ధతులను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ తనిఖీల్లో గ్యాస్ సిలిండర్ల నిల్వ, సరఫరా ప్రక్రియలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం కలిగించడం, కృత్రిమ కొరతను సృష్టించడం లేదా బ్లాక్ మార్కెట్లో విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, తహసీల్దార్ సంధ్యారాణి, ఇతర రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం నిత్యావసరాల సరఫరాపై నిఘా ఉంచింది.












