నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్ మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రాచీన బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్యకాలానికి చెందిన అరుదైన నాగవీరుడు, భైరవుడు, వీరగల్లు, లజ్జాగౌరీ వంటి విగ్రహాలు, శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం బౌద్ధ, జైన, శాక్తేయ, భైరవ సంప్రదాయాలకు కేంద్రంగా విలసిల్లిందని చరిత్ర పరిశోధకులు తెలిపారు.
ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావ్ తెలిపిన వివరాల ప్రకారం, లోకేశ్వర్ మండలంలోని గోదావరి తీరాన ఉన్న బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో 9-12 శతాబ్దాల నాటి అరుదైన శిల్ప సంపద బయటపడింది. ఈ ఆలయం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదని ఆయన పేర్కొన్నారు.
ఇక్కడ లభించిన శిల్ప సంపద, ఆనాటి బౌద్ధ, జైన, శాక్తేయ, భైరవ సంప్రదాయాల కేంద్రంగా ఈ ఆలయం అభివృద్ధి చెందిందని తెలియజేస్తోంది. గతంలో ఇదే ఆలయంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి కన్నడ శాసనం కూడా డా. దేవరావ్ చేత వెలుగులోకి వచ్చింది.
ఆలయ ప్రాంగణంలో లభించిన శిల్పాలలో నాగవీరుని విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది 9-12వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. యుద్ధ వీరుల జ్ఞాపకార్థం లేదా నాగారాధనలో భాగంగా దీనిని ప్రతిష్ఠించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తమైంది. గుర్రంపై యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుని రూపంతో కూడిన వీరగల్లు శిల్పం కూడా లభించింది.
అలాగే, చతుర్భుజ భైరవుని అరుదైన విగ్రహంతో పాటు, జైన సంప్రదాయ యక్షిణిని పోలి ఉన్న లజ్జాగౌరీ స్త్రీమూర్తి విగ్రహం, సప్తమాతృకల శిల్పాలు, శివలింగాలు, శిలాఖండాలు కూడా బయటపడ్డాయి. ఈ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను పురావస్తు శాఖ వెంటనే సంరక్షించాలని డా. దేవరావ్ కోరారు.











