తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్న కుంబింగ్ ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ డిమాండ్ చేశారు. ఈ ఆపరేషన్ను "కగార్" పేరుతో నిర్వహిస్తున్నారని, ఇది పాసిజం లక్షణమని ఆయన ఆరోపించారు.
గోవింద నాయక్ విడుదల చేసిన ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వం "ఆపరేషన్ కగార్" పేరుతో మావోయిస్టుల నిర్మూలనకు భారీ సైనిక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎనిమిదిన్నర లక్షల భద్రతా బలగాలు, వందలాది శిబిరాలతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర బలగాలతో పాటు నలువైపులా కుంబింగ్ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పరిపాలన చేపట్టాల్సిన ప్రభుత్వం ప్రజలపైనే యుద్ధం చేయడం సమంజసం కాదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
అడవుల్లో ఉన్న విలువైన ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే ఈ దమనకాండ జరుగుతోందని గోవింద నాయక్ ఆరోపించారు. "జల్ జంగల్ హమారా" నినాదంతో జీవిస్తున్న ఆదివాసీల జీవన విధానాన్ని, అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తక్షణమే కుంబింగ్ ఆపరేషన్ను నిలిపివేసి, ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


