Hyderabad/Shaikpet (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 25
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏర్పాటు పనులను శరవేగంగా చేపట్టాలని, భూ సేకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో రిజర్వాయర్ నిర్మాణంపై ఆయన ప్రత్యేకంగా చర్చించారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏర్పాటు పనులను శరవేగంగా చేపట్టాలని, ఇందులో భాగంగా భూ సేకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
సచివాలయంలో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులతో తాజా రాజకీయాలు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ తో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ఆయన ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, విప్ లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ప్రేమ్ సాగర్ రావు, నవీన్ యాదవ్, మట్టా రాగ మాయి, మందుల సామేల్, వేద్మ బొజ్జు, కోరం కనకయ్య, లక్ష్మి కాంత రావు, రామ్ దాస్ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళి నాయక్, యశస్విని రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘు వీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.
సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని, దీనికి సంబంధిత ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, ఫారెస్టు క్లియరెన్సులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సీఎం కోరారు.
సచివాలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏర్పాటుపై కీలక సూచనలు చేశారని, ముందుగా భూసేకరణ పనులు శరవేగంగా, ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని సూచించినట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా చివరి లిఫ్టు అయిన లక్ష్మీదేవిపల్లికి ముందు భూసేకరణ కార్యక్రమం చేపడితేనే, ఆ వెంటనే రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉంటుందని, అందుకే ముందుగా భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. శరవేగంగా పనులు చేపట్టేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం వద్ద నిధుల కొరత లేదని, ప్రాజెక్టుకు డబ్బులు కూడా మంజూరయ్యాయని ఎమ్మెల్యే శంకర్ ఈ సందర్భంగా మీడియాకు గుర్తు చేశారు.












