నిజామాబాద్ నీటి పారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) బోయిన్పల్లి రామారావు మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నిజామాబాద్లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో పలువురు అధికారులు, శ్రేయోభిలాషులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.
బోయిన్పల్లి రామారావు తన 34 సంవత్సరాల సేవా కాలాన్ని మచ్చలేని అధికారిగా పూర్తి చేసుకున్నారు. ఆయన ఎస్ఆర్ఎస్పీ పరిధిలో రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నీటి సరఫరాకు కృషి చేశారని పలువురు ప్రశంసించారు.
నిజామాబాద్ మాజీ జడ్పి చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు మాట్లాడుతూ, రామారావును 'ఎస్ఆర్ఎస్పీ పితామహుడు'గా అభివర్ణించారు. ఆయన నీతి నిజాయితీలతో కూడిన సేవలను కొనియాడారు.
భవిష్యత్తులో రామారావు సేవలు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల అభివృద్ధికి అవసరమని, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమ మద్దతు ఉంటుందని విఠల్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామారావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.








