నిర్మల్, 14 July
ఓటరు నమోదు, వెరిఫికేషన్ వంటి బీఎల్ఓ బాధ్యతలను ఆశా వర్కర్లపై బలవంతంగా మోపేందుకు ప్రయత్నించడం సరికాదని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు బి సుజాత అన్నారు. ఇప్పటికే పనిభారం ఎక్కువగా ఉన్న ఆశా వర్కర్లపై అదనపు బాధ్యతలు అప్పగించడం ఆరోగ్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆశా వర్కర్లపై బలవంతంగా బీఎల్ఓ బాధ్యతలను మోపేందుకు ప్రయత్నించడం సరికాదని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు బి సుజాత అన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, వెరిఫికేషన్ తదితర పనుల కోసం ఆశా వర్కర్లను బీఎల్ఓ విధులు నిర్వహించాలని ఒత్తిడి చేయడం వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
ఈ డిమాండ్‌తో జిల్లా అధ్యక్షురాలు బి సుజాత ఒక ప్రకటన విడుదల చేశారు. బీఎల్ఓ విధులు నిర్వహించేందుకు ఇప్పటికే అనేకసార్లు శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఆశా వర్కర్లపైనే ఈ బాధ్యతలను బలవంతంగా మోపేందుకు ప్రయత్నించడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే ఆశా వర్కర్లు గ్రామీణ ఆరోగ్య సేవలు, గర్భిణీల సంరక్షణ, శిశు ఆరోగ్యం, టీకాల కార్యక్రమాలు, ఇంటింటి సర్వేలు వంటి వివిధ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలుతో తీవ్ర పనిభారం ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా బీఎల్ఓ విధులు అప్పగించడం వల్ల ప్రజా ఆరోగ్య సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆశా వర్కర్లను వారి విధులకు సంబంధం లేని అదనపు పనులకు బలవంతంగా నియమించడం మానుకోవాలని, ఎలాంటి ఒత్తిళ్లు, వేధింపులకు గురిచేయకుండా ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఐటీయూ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆశా వర్కర్ల సేవలను గౌరవిస్తూ, వారికి అప్పగించిన ఆరోగ్య సంబంధిత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను అనుకూల వాతావరణం కల్పించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని కోరుతుందని తెలిపారు.











