తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్, నల్లగొండ రీజియన్ టిజిఎస్పిడిసిఎల్ సెక్రటరీ గుంటూరు శ్రీనివాస్ నేతృత్వంలో మిర్యాలగూడ డివిజన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ శ్రీనివాసాచారికి వినతిపత్రం అందజేసి, విద్యుత్ శాఖలో ఉద్యోగుల పదోన్నతులను నియమ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కోరారు.
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో అసిస్టెంట్ లైన్ మెన్ నుండి లైన్ మెన్, లైన్ మెన్ నుండి లైన్ ఇన్స్పెక్టర్లకు డిపిసి నిర్వహించి ప్రమోషన్లు ఇస్తున్నట్లుగా సమాచారం ఉందని, దీనిపై సంబంధిత ఉద్యోగుల కాన్ఫిడెన్షియల్ రిపోర్టులను అధికారుల నుండి తెప్పించుకోవాలని డిఈకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు గుంటూరు శ్రీనివాస్ తెలిపారు.
లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ల ప్రమోషన్లలో ఉద్యోగుల కాన్ఫిడెన్షియల్ రిపోర్టులతో పాటు, విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం హెడ్ క్వార్టర్స్ ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారుల నుండి తెప్పించుకున్న తర్వాతనే డిపిసి నిర్వహించాలని యూనియన్ కోరింది.
ప్రమోషన్ పొందాలనుకునే ఉద్యోగులు ప్రస్తుతం హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నట్లు, ఇంటి యజమాని యొక్క రెంటల్ అగ్రిమెంట్ ధృవీకరణ పత్రంతో పాటు విద్యుత్ సర్వీస్ నంబర్, తదితర వివరాలను తెప్పించుకున్న తర్వాతనే డిపిసి నిర్వహించి వారికి ప్రమోషన్ ఇవ్వాలని వినతి పత్రంలో స్పష్టం చేశారు. హెడ్ క్వార్టర్స్ లో లేని ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వరాదని యూనియన్ తేల్చి చెప్పింది.
నిబంధనల ప్రకారం ప్రమోషన్లు జరగకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని యూనియన్ హెచ్చరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు జి. రవీందర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి. చంద్రరావు, ఈజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని గుంటూరు శ్రీనివాస్ తెలిపారు.








