తెలంగాణలో నాన్-వెజ్ ప్రియులకు చేదువార్త. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు ఏప్రిల్ 1 నుండి నిరవధికంగా మూతపడనున్నాయి. వ్యాపార నిర్వహణ భారంగా మారి, లాభాల మార్జిన్ తగ్గడంతో షాపు యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
చికెన్ షాపుల యజమానుల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, పెరిగిన నిర్వహణ ఖర్చులు, తగ్గిన లాభాల మార్జిన్ కారణంగా వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. గతంలో కిలో చికెన్‌పై రూ.30-35 లాభం ఉండగా, ప్రస్తుతం అది రూ.5-6కి పడిపోయిందని యజమానులు వాపోతున్నారు. షాపు అద్దెలు, కరెంట్ బిల్లులు, కూలీల జీతాలు, ఇతర ఖర్చులు భారంగా మారాయని తెలిపారు.
పెద్ద పౌల్ట్రీ కంపెనీలు తమ ఫీడ్, రవాణా ఖర్చులు పెరిగాయని చెబుతూ, రిటైల్ వ్యాపారులకు తగిన మార్జిన్ ఇవ్వడం లేదని షాపు యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి తమను వ్యాపారాన్ని మూసివేసే స్థాయికి నెట్టివేసిందని వారు తెలిపారు.
చికెన్ షాపుల మూసివేతతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ప్రభావం పడనుంది. చికెన్ అందుబాటులో లేకపోతే, మటన్ ధరలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మటన్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని, చికెన్ కూడా దొరకకపోతే నాన్-వెజ్ ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 8,000 నుండి 10,000 చికెన్ షాపులున్నాయి. ఈ రంగంపై అనేక కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు, షాపు యజమానుల మధ్య ఈ ధరల వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే, మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.












