ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులకు రేపు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తిరుమల గార్డెన్స్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల వారీగా కౌన్సిలర్లకు, మండలాల వారీగా సర్పంచ్‌లకు సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
కార్యక్రమం సకాలంలో ప్రారంభమై, సాఫీగా సాగేలా చూడాలని, దీనికోసం నాణ్యమైన లైటింగ్, సౌండ్ సిస్టం, ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హాజరయ్యే వారికి నిరంతరాయంగా త్రాగునీరు అందించాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాహనాల పార్కింగ్ కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని, భోజనశాలను పరిశీలించి, నాణ్యమైన ఆహారాన్ని సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులకు పాలన, ప్రగతి ప్రణాళికలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


