ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన సందర్భంగా ఆమె ఈ సూచనలు చేశారు.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని ఆమె తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలను తనిఖీ చేయాలని, వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని తెలిపారు.


