నిర్మల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వార్తలు అపోహలేనని ఆమె స్పష్టం చేశారు.
కొన్ని పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్న నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అపోహలేనని, అవసరం లేకపోయినా ప్రజలు బంకుల వద్దకు చేరుకోవడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని ఆమె పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా కొనసాగుతోందని, పెట్రోల్ బంకుల అసోసియేషన్ ప్రతినిధులు కూడా తమ వద్ద తగిన నిల్వలు ఉన్నట్లు ధృవీకరించినట్లు తెలిపారు. అదేవిధంగా, జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సిలిండర్ల బుకింగ్, సరఫరా ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని సూచించారు.
పరిస్థితిని దగ్గరగా గమనించేందుకు అదనపు కలెక్టర్లు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారని, అవసరమైన చోట్ల వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ‘పానిక్ బాయింగ్’కు పాల్పడవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజలకు అవసరమైన ఇంధన వనరులు నిరంతరం అందుబాటులో ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు.












