పట్టణ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని 38వ వార్డులో ఆమె ఆకస్మిక పర్యటన చేసి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం నిర్మల్ పట్టణంలోని బుధవార్ పెట్ 38వ వార్డులో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వీధుల గుండా తిరుగుతూ, రోజువారీ పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి వసతి, ఇతర సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.
స్థానికులతో నేరుగా మాట్లాడుతూ, వారికి తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి, చెత్త వాహనాలకు అందించాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారవేయరాదని ఆదేశించారు.
అధికారులతో మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన మౌళిక వసతులు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని, వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతిరోజూ చెత్త వాహనాలను అన్ని వీధుల్లోకి తిప్పాలని, సమయానికి తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట్ల డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని, డ్రైనేజీ పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.


