జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేసి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీ అయిన ఫైజాన్ అహ్మద్ కు నిర్మల్ కలెక్టరేట్ లో గురువారం రాత్రి వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఫైజాన్ అహ్మద్ సేవలను కొనియాడారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఫైజాన్ అహ్మద్ స్థానిక సంస్థల బలోపేతానికి, పల్లె, పట్టణ ప్రగతి, ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు వంటి కార్యక్రమాలలో విశేష కృషి చేశారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించే తత్వం ఆయన సొంతమని ప్రశంసించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కూడా ఆయన అదే స్ఫూర్తితో పనిచేసి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
బదిలీపై వెళ్లిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, జిల్లా అభివృద్ధిలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని తెలిపారు. విధుల నిర్వహణలో తనకు సహకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది కూడా ఫైజాన్ అహ్మద్ తో తమకున్న అనుబంధాన్ని, ఆయన అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఫైజాన్ అహ్మద్ దంపతులను పూలమాల, శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డిఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


