తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియలో సాంకేతిక లోపాలను సరిదిద్దాలని, దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నిర్మల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ముఖ్యంగా దరఖాస్తును 'సబ్మిట్' చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం లేకపోవడాన్ని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
చిన్నపాటి క్లరికల్ తప్పుల వల్ల అర్హులైన జర్నలిస్టుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీనిపై వందలాది మంది జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారని వారు తెలిపారు.
ఈ సమస్యను సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, పోర్టల్లో ఎడిట్ లేదా రివ్యూ సదుపాయాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ చర్యల ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనిట్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.








