రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక మినహాయింపులు ఇచ్చింది. ఇళ్లు పూర్తిగా సిద్ధం కాకపోయినా, నివాసయోగ్యంగా ఉంటే తుది విడత బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గతంలో ఉన్న కొన్ని సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. ఇల్లు వంద శాతం పూర్తి కాకపోయినా, నివాసయోగ్యంగా ఉంటే చాలు తుది విడత బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించడం లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
గతంలో ఇంటి ఫ్లోరింగ్, లోపలి ప్లాస్టరింగ్, పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి ఫినిషింగ్ పనులు పూర్తయితేనే కంప్లీషన్ స్టేజ్ ఫోటోలను అప్లోడ్ చేసి బిల్లులు పొందే అవకాశం ఉండేది. అయితే, ఆర్థిక స్థోమత లేని కారణంగా చాలా మంది లబ్ధిదారులు ఈ పనులను సకాలంలో పూర్తి చేయలేక తుది విడత బిల్లులకు దూరమవుతున్నారని ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలో, నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇంటి లోపల ఫ్లోరింగ్ పని పూర్తి కాకపోయినా, లోపలి వైపు ప్లాస్టరింగ్ లేకున్నా, లోపలి గదులకు తలుపులు లేకపోయినా, పూర్తిస్థాయి వైరింగ్ లేకపోయినా తుది విడత బిల్లులు మంజూరు చేయాలని ఆదేశించింది. కేవలం ఇంటి ప్రధాన ద్వారం, బయటి వైపు వైట్ వాష్/పెయింటింగ్, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది.
ఈ సవరించిన నిబంధనలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది కేవలం ఇంటి నిర్మాణ పటిష్టతపై దృష్టి పెట్టాలని, చిన్న చిన్న హంగుల కోసం బిల్లులు ఆపవద్దని సూచించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా తుది దశలో ఉన్న వేలాది ఇండ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమమైంది.












