నిర్మల్, 2026-08-05
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టాలని అంగన్వాడీ ఉద్యోగులకు సీఐటీయూ పిలుపునిచ్చింది. నిర్మల్‌లో జరిగిన అంగన్వాడీ యూనియన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిర్మల్: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆగస్టు 10న నిర్వహించనున్న 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యాలయం పిలుపునిచ్చింది.
ఈ మేరకు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో అంగన్వాడీ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. లలిత అధ్యక్షత వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో ప్రతి అంగన్వాడీ టీచర్, ఆయా తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం (NEP) మరియు పీఎం-శ్రీ (PM SHRI) వంటి పథకాల ద్వారా విద్యా రంగాన్ని, ఐసీడీఎస్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆమె విమర్శించారు.
అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీ టీచర్లను, ఆయాలను కార్మికులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని ఆమె కోరారు.
ఈ సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. లలిత, జిల్లా కార్యదర్శి శైలజ, నాయకులు సాదా, నర్సమ్మ, శేకుంతల, భూలక్ష్మి, దీప తదితరులు పాల్గొన్నారు.












