యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపునకు క్రీడలు దోహదం చేస్తాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి (బీఎల్ఆర్) పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహించిన జీపీఎల్ సెషన్ 2 క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది.
మిర్యాలగూడ ప్రభుత్వ కళాశాల మైదానంలో బీఎల్ఆర్, ఎన్.వి.ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నూకల చారిటబుల్ ట్రస్ట్ ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించింది. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యే బీఎల్ఆర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక, మానసిక పటుత్వాన్ని పెంపొందిస్తాయని, విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు.
గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. యువత తమ దైనందిన జీవితంలో క్రీడలను ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, నూకల చారిటబుల్ ట్రస్ట్ అధినేత నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జి, ఆర్గనైజర్లు, క్రీడాకారులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

