ద్యావరాశెట్టి రమేష్ జ్ఞాపకార్థంగా నిర్మల్ 40వ వార్డ్‌లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేతలకు, రన్నరప్‌లకు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.
టోర్నమెంట్ అనంతరం జరిగిన సభలో వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, సహనం, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని, చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని యువతకు సూచించారు.
టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు, రన్నరప్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు మున్సిపల్ పాలకవర్గం ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, రాఘవేంద్ర చారి, ఆడప పోశెట్టి, నాయకులు ఆడప శ్రీకాంత్, వార్డ్ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












