- సరస్వతి నగర్ ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన
- రెండు నెలలుగా నీటి సరఫరా లేకపోవడంతో ఆగ్రహం
- అధికారులు హామీ ఇచ్చిన తర్వాత ధర్నా విరమించారు
: సరస్వతి నగర్ గ్రామ ప్రజలు తాగునీటి సమస్యపై నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా నీటి సరఫరా లేకపోవడంతో, ఖాళీ బిందెలతో భైంసా – బాసర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఎంపీడీవో, తహశీల్దార్ హామీ ఇచ్చిన తర్వాత ధర్నా విరమించారు. ధర్నా కారణంగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ముధోల్ మండలం ముద్గల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సరస్వతి నగర్ గ్రామ ప్రజలు, గురువారం తాగునీటి సమస్యపై రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో భైంసా – బాసర్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తూ, “కావాలి, కావాలి, నీళ్లు కావాలి” అంటూ నినాదాలు చేశారు. రెండు నెలలుగా మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాగునీరు అందక పిల్లలను పాఠశాలకు పంపడం కూడా కష్టమైందని, బేసిక్ అవసరాల కోసం కూడా నీళ్లు అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి, గ్రీడ్ కంపెనీ ఇంజినీరింగ్ అధికారులకూ సమస్య తెలియజేసినా, వారు “మా బాధ్యత ట్యాంక్‌లో నీళ్లు నింపేవరకు మాత్రమే” అంటూ బదులిచ్చారని గ్రామస్తులు ఆరోపించారు.
ఈ ధర్నా విషయం తెలుసుకున్న ఎంపీడీవో శివ కుమార్, తహశీల్దార్ శ్రీకాంత్, సీఐ మల్లేష్, ఎస్సై సాయికిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని, రెండు రోజుల్లో మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు ధర్నా విరమించారు. ఈ నిరసన కారణంగా ముప్పై నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.