చిత్తూరు, 2026-06-05
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీకి ఒక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీకి ఒక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. యనమలకు గవర్నర్ పదవి దాదాపుగా ఖరారైనట్లు ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి.
గవర్నర్ల మార్పుపై కేంద్రం నిర్ణయం
పదవీ కాలం ముగిసిన వారితో పాటుగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల గవర్నర్లను మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, బీహార్ రాష్ట్రాల గవర్నర్లను మార్చే అవకాశం ఉంది. రాజ్యాంగ వ్యవహారాలు, అసెంబ్లీ నిర్వహణపై మంచి పట్టున్న యనమలను ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ కు ఒక మంచి గవర్నర్ అవసరమని భావిస్తున్న కేంద్రం, యనమలను బీహార్ కు పంపితే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
యనమల రాజకీయ నేపథ్యం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పీకర్ గా, ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు పనిచేశారు. ఆయన కుమార్తె దివ్య ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యనమల టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నప్పటికీ, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారు.
బీసీల్లో పట్టు నిలుపుకోవాలనే యోచన
భవిష్యత్ అవసరాల దృష్ట్యా యనమల సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీసీల్లో పట్టున్న యనమలకు గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా టీడీపీకి బీసీల్లో ఉన్న క్రేజ్ ను నిలుపుకోవచ్చన్నది సీఎం ఆలోచనగా చెబుతున్నారు.
ఇతర నాయకుల ప్రయత్నాలు
టీడీపీ నుంచి మరికొందరు సీనియర్ నాయకులు కూడా గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. రాజకీయ సమీకరణల్లో భాగంగా చంద్రబాబు మాజీ స్పీకర్ యనమల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కేఇ కృష్ణమూర్తి, ప్రతిభా భారతిలకు స్థాయికి తగిన పదవి ఇచ్చి గౌరవించాలని నిర్ణయించినట్లు వినికిడి.












