రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి నిధుల కేటాయింపుపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని, కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ ధర్నా చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ విమర్శించారు.
శుక్రవారం నిర్మల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేటాయించిన 15 కోట్ల ప్రత్యేక నిధులపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ నిధులు ఎమ్మెల్యేల సిఫార్సులతో కాకుండా, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి నేరుగా కేటాయించారని స్పష్టం చేశారు.
గతంలో వార్డుల సమస్యలపై అవగాహన లేకుండా జరిగిన బడ్జెట్ కేటాయింపులను కొత్త పాలకవర్గం రద్దు చేసిందని, వార్డు అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిర్మల్ పట్టణం అమృత్ 2 లో గుర్తించడంలో ఎమ్మెల్యే ప్రమేయం లేదని, లక్షకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీలను కేంద్రం అమృత్ 2 లో గుర్తించిందని, అందులో 90 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలు కూడా ఉన్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం సమంజసం కాదని, పట్టణాన్ని అభివృద్ధిలో ముందుంచాలనే లక్ష్యంతో కొత్త పాలకవర్గం పనిచేస్తుందని, తమకు అడ్డుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అబద్ధపు మాటలు, తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.
ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్లు కత్తి నరేందర్, గోపు గోపి, ఎస్పీ రాజు, లక్కాకుల హరీష్, నాయకులు అడప పోశెట్టి, ఆకుల రామకృష్ణ, చైతన్య, చారి తదితరులు పాల్గొన్నారు.












