కేంద్ర ప్రభుత్వ కన్నుసన్నల్లో నడిచే ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వ వైద్యుల ముసుగులో శనివారం ఉదయం జంతర్‌మంతర్ వద్ద పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష శిబిరంపై దాడి చేసి, ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. 21 రోజుల దీక్షతో నీరసించిపోయిన వాంగ్చుక్ను పోలీసులు చుట్టుముట్టి, తెల్లటి బెడ్‌షీట్‌తో చుట్టి, అంబులెన్స్‌లో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో దీక్షా వేదిక వద్ద కొందరు ప్రతిఘటించడానికి ప్రయత్నించినా, పోలీసులు బలప్రయోగంతో వారిని అణచివేశారు.
ఈ బలవంతపు తరలింపునకు కొంత సమయం ముందే జంతర్‌మంతర్ వద్ద ఫోన్ జామింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం వల్ల, అక్కడ జరిగిన సంఘటనలు బయటి ప్రపంచానికి వెంటనే తెలియని పరిస్థితి ఏర్పడింది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టు వ్యక్తం చేసిన ఆందోళనను సాకుగా చూపుతూ పోలీసులు తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే, తమను సంప్రదించకుండానే ఈ చర్యకు పాల్పడ్డారని వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. ఆసుపత్రిలో జరిగిన పరీక్షల్లో వాంగ్‌చుక్ పొటాషియం స్థాయి తగ్గినట్లు తేలిందని, దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ, మరో ల్యాబ్‌లో పరీక్షకు అనుమతించలేదని ఆమె తెలిపారు. తన అనుమతి లేకుండా భర్తకు ఎలాంటి చికిత్స అందించవద్దని ఆమె డిమాండ్ చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి)కి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. 21 రోజుల దీక్ష తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం, వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటం, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తుండటంతో, ఢిల్లీ పోలీసులు ఈ చర్యకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించడాన్ని నిరసిస్తూ, సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జంతర్‌మంతర్ వద్దే నిరాహార దీక్షను ప్రారంభించారు. అతనిపై ఒక సంఘ్ పరివార్ మద్దతుదారుడు సిరా చల్లే ప్రయత్నం చేశారు.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కూడా వాంగ్చుక్కు సంఘీభావంగా నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించింది. ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజీ, సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ పరిణామాలతో జంతర్‌మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, న్యాయవాదులు, సినీ ప్రముఖులు పోలీసుల చర్యను ఖండించారు. పోలీసుల చర్య అనంతరం, వేలాది మంది జంతర్‌మంతర్‌కు తరలివచ్చారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ కింద పనిచేసే ఢిల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌లు ధర్మేంద్ర ప్రదాన్‌ను రక్షించడం కొనసాగిస్తే, వారు తమను తాము కాపాడుకోలేరని అన్నారు. వాంగ్‌చుక్ వద్దకు అనుమతించలేదని, ఎంపీలు పోలీసులతో వాదించినా అనుమతి లభించలేదని ఆయన తెలిపారు. వాంగ్చుక్ను బలవంతంగా తరలించడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.












