వరంగల్, 2026-08-25
ఉమ్మడి వరంగల్ జిల్లా మార్క్సిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, హత్యారాజకీయాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలి సారంపల్లి మల్లారెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఆయన సర్పంచ్‌గా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మార్క్సిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, హత్యారాజకీయాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలి సారంపల్లి మల్లారెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. సీపీఐ(ఎం) పార్టీలో సారంపల్లి మల్లారెడ్డి కుటుంబం ఒక భాగమని, ఆయన సర్పంచ్‌గా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు. నదీజలాల సమగ్ర పంపిణీ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై ఆయనకున్న అపార జ్ఞానం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
మార్క్సిస్టు ఉద్యమ బలోపేతానికి కృషి
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన సారంపల్లి మల్లారెడ్డి, మార్క్సిస్టు ఉద్యమ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. నర్సంపేట డివిజన్ కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని సారంపల్లి మల్లారెడ్డి, పుచ్చకాయల చంద్రారెడ్డి ఆప్తమిత్రులుగా కలిసి అకుంఠిత దీక్షతో నిర్మించారు. ఇటీవలె పుచ్చకాయల చంద్రారెడ్డి మరణించిన విషయం తెలిసిందే. చంద్రారెడ్డి సంతాపసభ సందర్భంగా మల్లారెడ్డి నవతెలంగాణకు నాటి పోరాటాలు, పార్టీ బలోపేతంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు ఎదురొడ్డి సీపీఐ(ఎం)ను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. మార్క్సిస్టు ఉద్యమంలో సారంపల్లి మల్లారెడ్డి మహోపాధ్యాయులుగా, అతివాద పోకడలు, హత్యారాజకీయాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలిగా, సమసమాజం కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన స్ఫూర్తిదాతగా గుర్తింపు పొందారు.
బాల్యం, కుటుంబ నేపథ్యం
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని తిమ్మంపేటలో సారంపల్లి కృష్ణారెడ్డి, రాధమ్మ దంపతులకు ఆగస్టు 25, 1939లో మల్లారెడ్డి జన్మించారు. 1964 నుండి 1971 వరకు తిమ్మంపేట గ్రామ పోలీస్ పటేల్‌గా మల్లారెడ్డి పనిచేశారు. ఆగస్టు 6, 1971లో తిమ్మంపేట గ్రామంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో ఎకె గోపాలన్ తిమ్మంపేట గ్రామాన్ని సందర్శించారు. 1953లో మల్లారెడ్డి కనకలక్ష్మీని వివాహమాడారు. 1954లో తండ్రి సారంపల్లి కృష్ణారెడ్డి, 1988లో తల్లి రాధమ్మ మరణించారు. 1957-58లో మల్లారెడ్డి పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. 1959 జులైలో వాసుదేవరెడ్డి, 1962 ఆగస్టులో మధుసూదన్‌రెడ్డి జన్మించారు. 1964 ఫిబ్రవరిలో కనకలక్ష్మీ మరణించడంతో 1966 మార్చిలో భాగ్యలక్ష్మీని వివాహమాడారు. సారంపల్లి మల్లారెడ్డి కుమారులిద్దరూ సీపీఐ (ఎం)లో కొనసాగుతున్నారు. సారంపల్లి వాసుదేవరెడ్డి సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శిగా గతంలో పని చేయగా, సారంపల్లి మధుసూదన్‌రెడ్డి న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
పుచ్చకాయల చంద్రారెడ్డితో స్నేహం, పార్టీ పునర్నిర్మాణం
ఉమ్మడి వరంగల్ జిల్లా మార్క్సిస్టు ఉద్యమంలో పుచ్చకాయల చంద్రారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి ఆప్తమిత్రులు. వారిద్దరూ నర్సంపేట డివిజన్లో పార్టీ మనుగడకు వీరోచితంగా పోరాడారు. నాటి కాంగ్రెస్ హత్య రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఓంకార్ వెంట పార్టీ కేడర్ అంతా వెళ్లిపోయినా, వారిద్దరూ పార్టీలోనే కొనసాగి తిరిగి పార్టీని బలోపేతం చేశారు. 1960లో సీపీఐ(ఎం)లో పీసీఆర్ చేరగా, 1973లో సారంపల్లి మల్లారెడ్డి పార్టీ సభ్యుడయ్యారు. నర్సంపేట తాలూకాలో, డివిజన్ స్థాయిలో పార్టీ నిర్మాణానికి అంకితభావంతో కృషి చేశారు. నిర్బంధంలో సీపీఐ(ఎం)ను పునర్నిర్మించడంలో వీరిద్దరిదీ కీలకపాత్ర. 1000 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి శ్రమదానంతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్ నేతల దాడుల నేపథ్యంలోనూ పార్టీని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. ఓంకార్ హింసావాద పోకడలను ఎండగట్టి పార్టీని కాపాడుకోవడానికి కృషి చేశారు. ఓంకార్‌ను సీపీఐ(ఎం) సస్పెండ్ చేశాక పార్టీ కేడర్ యావత్తు ఓంకార్‌తో వెళ్లిపోయినా మొక్కవోని ధైర్యంతో సీపీఆర్, మల్లారెడ్డి పార్టీని పునర్నిర్మించారు. నర్సంపేట డివిజన్ పార్టీ కార్యదర్శిగా కూడా పీసీఆర్ పనిచేశారు. 1996 వరకు సారంపల్లి, పీసీఆర్ కలిసి పనిచేశారు. అనంతరం సారంపల్లి పార్టీ అవసరాల దృష్ట్యా హైద్రాబాద్‌కు వచ్చారు. నర్సంపేట నుంచి పీసీఆర్ వరంగల్‌కు వచ్చి పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా, కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా సేవలందించారు. 1985లో జనగామ ఎమ్మెల్యేగా సీపీఐ(ఎం) నాయకులు ఏసిరెడ్డి నర్సింహారెడ్డి ఎన్నికయ్యాక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి పునర్వైభవం వచ్చింది. 1990లో నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపూర్ మండలాల్లో మళ్లీ పార్టీ శాఖలు నిర్మించారు.
రైతాంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతాంగ సమస్యలపై సారంపల్లి అలుపెరుగని పోరాటం చేశారు. ఎస్సారెస్పీ కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వెన్నవరం కాలువ కోసం పాదయాత్ర నిర్విహించి రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తెచ్చారు. నీటిపారుదల రంగం, విద్యుత్ రంగం, రైతాంగ సమస్యలపై సమగ్ర అవగాహన కలిగిన మల్లారెడ్డి విషయంలో ఉన్నతాధికారులు సైతం ఆయన్ను మిత్రుడిగానే భావించే వారు. మార్కెట్ దోపిడీ, రైతులను మోసం చేస్తున్న తీరును ఎండగట్టేవారు. ప్రాజెక్టులపై అధ్యయనం చేయడం జరుగుతున్న పొరపాట్లపై ఎప్పటకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. వరంగల్ జిల్లాలో నకిలీ, కల్తీ విత్తనాల అమ్మకాలు, రైతులు మోసపోయిన ప్రతి సందర్భంలో సారంపల్లి రైతు సంఘం నేతగా స్పందించేవారు. అటు అధికారులతో, ఇటు రైతులతో నిత్యం సంబంధాలు కలిగి సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించారు.
ఎస్సారెస్పీ కాలువల పూర్తికి నిరంతర పోరాటం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పరిధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాలువల నుండి పంట కాలువల వరకు సమగ్ర అధ్యయనం చేసి త్వరితగతిన పూర్తి చేయడానికి నిరంతర రైతాంగ పోరాటాన్ని సారంపల్లి ముందుకు తీసుకువెళ్లారు. ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీలలో డిబిఎం 31, 38 (మోరంచ కాలువ), డిబిఎం 40 (తీగలవేణి), డిబిఎం 48 (వెన్నవరం) వంటి ప్రధాన కాలువలను త్వరితగతిన పూర్తి చేయడానికి పోరాడారు. ఈ కాలువలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక పుస్తకాలు రాసి రైతుల్లో చైతన్యం నింపారు. ఈ పోరాటం నాలుగు దశాబ్ధాలపాటు సార్వత్రిక ఎన్నికల్లో ఎజెండాగా నిలిచింది.
ప్రజా పోరాటాలకు నాయకత్వం
సర్పంచ్ నుంచి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులుగా సారంపల్లి మల్లారెడ్డి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు. తుదిశ్వాస విడిచే వరకు ప్రజల పక్షాన మార్క్సిస్టు దృక్పథాన్ని ఆచరణించిన ఆయన ఉద్యమ ప్రస్తానం నేటి తరానికి ఎంతో స్పూర్తిదాయకం.








