ఓటర్ల జాబితా సవరణ, గృహ గణన వంటి కీలక ప్రక్రియలకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని మిర్యాలగూడ ఆర్డీఓ ఎస్. రమణారెడ్డి సూచించారు. స్థానిక రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు పలు సూచనలు చేశారు.
బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలను తహసీల్దార్లకు అందించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో భాగంగా జరుగుతున్న మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని ఆర్డీఓ కోరారు. ఓటర్ల జాబితాలో తప్పులు సరిదిద్దేందుకు ఫారం-8 వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పార్టీల నాయకులకు సూచించారు.
జనాభా గణన-2027లో భాగంగా నిర్వహించే గృహ గణనకు కూడా రాజకీయ పార్టీలు సహకరించాలని రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆయన పార్టీల ప్రతినిధులను కోరారు.
ఈ సమావేశంలో డిఎఓ శ్రీనివాస్ శర్మ, పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ ఎన్నికలు ప్రవీణ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వీరు తమ తమ పార్టీల తరపున అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు.








