తమిళనాడులోని చెన్నై నుండి ప్రారంభమైన రాజీవ్ మెమోరియల్ జ్యోతి యాత్రకు ఆదివారం నిజామాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సేవలను గర్వంగా స్మరించుకుంటుందని తెలిపారు. 1944 ఆగస్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీ, 1984 నుండి 1989 వరకు భారత దేశ 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఆయన పాలనలో టెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, విద్యా రంగాల్లో చేపట్టిన కీలక సంస్కరణలు ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేశాయని పేర్కొన్నారు.
యువత సాధికారత, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఆధునిక భారత నిర్మాణంపై రాజీవ్ గాంధీ కలిగిన దూరదృష్టి నేటికీ యువతకు ప్రేరణగా నిలుస్తుందని నాయకులు కొనియాడారు. ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.











