ఖమ్మం, జులై 22
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధు ఆరోపించారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే రాజకీయ కక్షతో కేసులు పెట్టిస్తున్నారని, ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబుపైనే ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మంథని నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని పుట్ట మధు ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పుట్ట మధు మాట్లాడారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే రాజకీయ కక్షలతో పోలీసులతో అక్రమ కేసులు పెట్టేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంథని నియోజకవర్గ అభివృద్ధిని పక్కనబెట్టి, బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టించడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.
బీఆర్ఎస్ కార్యకర్త పూదరి సత్యనారాయణ తల్లిపై కూడా కేసు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. 70 ఏళ్ల వృద్ధురాలిపై కేసు పెట్టించడం సిగ్గుచేటని విమర్శించారు. అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు కోర్టుల్లో జడ్జీలతో చీవాట్లు తింటున్న పరిస్థితి కూడా నెలకొందని ఆరోపించారు.
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఆ సమయంలో అక్రమ కేసులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేస్తూ అక్రమ కేసులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తామన్నారు. ఏ కార్యకర్తను ఒంటరిగా వదిలిపెట్టబోమని పుట్ట మధు స్పష్టం చేశారు.











